: శ్రుతిహాసన్ కేసు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ... త్వరలో నోటీసులు?
టాలీవుడ్ అగ్రనటి శ్రుతిహాసన్ పై నమోదైన ఛీటింగ్ కేసు దర్యాప్తు హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు మారింది. ఒప్పందం సమయంలో కాల్షీట్లు ఇచ్చి షూటింగ్ సమయంలో తనకు కుదరదంటూ దర్శక, నిర్మాతలను మోసం చేసిందని శ్రుతిహాసన్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒప్పందంపై సంతకాలు, అడ్వాన్స్ చెల్లింపులు, కాల్షీట్ల డేట్లు తదితర ప్రక్రియ మొత్తం బంజారాహిల్స్ రోడ్ నెంబరు:2 లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిందట. ఈ ప్రాంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు, నిన్న కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ శ్రుతిహాసన్ కు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. విచారణ సందర్భంగా ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేస్తారు.