: ఐఎస్ఐఎస్ భయంతో 739 మంది విద్యార్థులకు 'నో' చెప్పిన బ్రిటన్


బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో అణు, జీవ, రసాయన ఆయుధాల రూపకల్పనకు దోహదపడే కోర్సులు చేసేందుకు దరఖాస్తు చేసుకున్న 739 మంది విద్యార్థుల అడ్మిషన్లకు బ్రిటన్ గవర్నమెంట్ ఐఎస్ఐఎస్ భయంతో 'నో' చెప్పింది. ఐఎస్ఐఎస్ పేట్రేగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టెర్రరిస్టుల చేతుల్లోకి జీవ, అణు, రసాయన ఆయుధాలు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే తామీ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఏఏ దేశాల విద్యార్థుల దరఖాస్తులు తిరస్కరించారో వెల్లడించలేదు. కాగా, ఈస్ట్ లండన్ సెకండరీ స్కూల్ లో ఇలాంటి కోర్సులు చేసిన ఐదుగురు విద్యార్థినులను దేశం విడిచి వెళ్లవద్దని బ్రిటన్ ఆదేశించింది. ఇలాంటి కోర్సు చదివిన ముగ్గురు విద్యార్థినులు ఐఎస్ఐఎస్ లో చేరేందుకు వెళ్లారనే వార్తల నేపథ్యంలో ట్రావెల్ ఆంక్షలు విధించింది. సద్దాం హుస్సేన్ దగ్గర జీవ, రసాయనిక యుద్ధ కార్యక్రమంలో పని చేసిన డాక్టర్ రిహాబ్ తహా అలియాస్ డాక్టర్ జెర్మ్ బ్రిటన్ లోనే పరిశోధనలు చేశారు. బ్రిటన్ లో జీవ, రసాయన, అణు రంగాల్లో అత్యుత్తమ ల్యాబ్ లు ఉండడంతో ఈ రంగాల్లో విద్యనభ్యసించేందుకు ఎక్కువమంది ఉత్సాహం చూపుతారు. ఈ కోర్సుల్లో చేరేందుకు 3,400 మంది దరఖాస్తులు చేయగా, వారిలో 739 మంది దరఖాస్తులు తిరస్కరించారు.

  • Loading...

More Telugu News