: రూ. 100 దాటిన కందిపప్పు ధర... నిత్యావసరాల ధరలు నింగికి... బతుకు భారం!
పేదలు, చిరుద్యోగుల బతుకులు భారంగా మారుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. అనునిత్యం వినియోగించే వస్తువుల ధరలు అందనంత ఎత్తునకు చేరుతున్నాయి. బియ్యం, పప్పు, నూనె తదితరాల ధరలు, ముఖ్యంగా, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరిలో రూ. 72 ఉన్న కిలో కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ. 102లకు చేరుకుంది. రెండు నెలల క్రితం సోనా మసూరి (కొత్త) బియ్యం ధర క్వింటాల్ రూ. 3 వేల వరకూ ఉండగా ప్రస్తుతం రూ. 3400లకు చేరింది. ఇక పాత బియ్యం ధర క్వింటాల్ కు రూ. 4800 నుంచి రూ. 5000లు వరకూ పలుకుతోంది. వీటికి తోడు కారం, చింతపండు, ధనియాలు, పల్లీలు, పుట్నాలు, బెల్లం, పంచదార తదితర నిత్యావసరాల ధరలు కిలోకు రూ.6 నుంచి రూ. 10 వరకూ పెరిగాయి. నెల బడ్జెట్ లో అధికభాగం ఆహార, నిత్యవసరాలకే కేటాయించాల్సి వస్తోందని చిరుద్యోగులు వాపోతున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజల బతుకులు సైతం ధరల పెరుగుదలతో భారంగా మారాయి.