: బాసర వెళ్తూ, అనంత లోకాలకు...!
బాసర దేవాలయానికి వెళుతున్న భక్తులను యాక్సిడెంటు రూపంలో మృత్యువు కబళించింది. మెదక్ జిల్లా చేగుంట సమీపంలోని రెడ్డిపల్లి బైపాస్ సర్కిల్ వద్ద జాతీయ రాహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాదులోని మియాపూర్ జేపీ నగర్‌కు చెందిన వంగ పుష్పవతి (50), యశశ్విన్ (5), రత్నరెడ్డి (60)లు కారులో బాసర ఆలయానికి బయలుదేరారు. చేగుంట సమీపంలో వీరి కారును మరో కారు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.