: మురళీమోహన్ హయాంలో అవకతవకలు ఇవిగో... మీడియా ముందుకు ఒ.కల్యాణ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మా అధ్యక్ష పదవి కోసం రాజేంద్రప్రసాద్, జయసుధ వర్గాల మధ్య అగ్గిరాజుకుంది. ప్రస్తుత మా అధ్యక్షుడు మురళీమోహన్... జయసుధకు మద్దతిస్తుండగా, నాగేంద్రబాబు వర్గం రాజేంద్రప్రసాద్ కు కొమ్ముకాస్తోంది. ఈ నేపథ్యంలో, మురళీమోహన్ హయాంలో కొన్ని అవకతవకలు జరిగాయంటూ నటుడు ఒ.కల్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. అసోసియేషన్ కు చెందిన సొమ్ములో ఐదు లక్షల రూపాయలను మురళీమోహన్ దైవ సన్నిధానానికి ఇచ్చారని ఆరోపించారు. సంఘం కార్యవర్గానికి ఈ విషయం తెలియదని అన్నారు. ఈ అంశంపై మురళీమోహన్ ను మోహన్ బాబు కూడా ప్రశ్నించారని కల్యాణ్ వివరించారు. ఇక, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వెనకున్నది మురళీమోహనే అని అన్నారు. ఆటగాళ్లు ఎండలో ఆడితే వచ్చిన సొమ్మును సైతం దుర్వినియోగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డైరీల ముద్రణ విషయంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. తాను ఈ విషయంలో ప్రశ్నించానని చెప్పారు. ఎన్నో ఉత్తరాలు రాశానని, దేనికీ బదులివ్వలేదని అన్నారు.