: ఫుల్ ట్యాంక్ చేయకండి!... చేశారా?... మూల్యం చెల్లించుకుంటారు: కంపెనీల హెచ్చరిక
కార్లు, ద్విచక్ర వాహనాలలో పెట్రోలు ఫుల్ ట్యాంక్ నింపొద్దంటూ ఆయిల్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. వేసవి తాపం పెరగడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అందుకే పేలుడు కారకాలైన పెట్రోల్, డీజిల్ ట్యాంకులు నింపి ఉంచుకోవడం శ్రేయస్కరం కాదని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. చెన్నై సహా దేశంలోని ప్రధాన నగరాల్లో వేసవి ఉష్ణోగ్రతలు అంచనాలకు మించి నమోదవుతున్నాయని, ఆఫర్లు ఉన్నాయనే కారణంగా ట్యాంకులు ఫుల్ చేసుకోవద్దని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. సరైన పార్కింగ్ సౌకర్యాలు లేక పట్టణాల్లోని వాహనాలను పెద్దసంఖ్యలో మండుటెండల్లోనే పార్క్ చేస్తుంటారు. దీంతో ట్యాంకు ఫుల్ చేస్తే, ఎండ తీవ్రతకు పేలిపోతుందని, లేక, మంటలు రేగే ప్రమాదం ఉందని వారు సూచిస్తున్నారు. ఫుల్ ట్యాంక్ కు బదులు సగం ట్యాంకు నింపుకుంటే మంచిదని ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి.