: 'మా' ఎన్నికలకు సిటీ సివిల్ కోర్టు గ్రీన్ సిగ్నల్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలకు హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టు పచ్చ జెండా ఊపింది. ఆదివారం (ఈ నెల 29న) ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ కౌంటింగ్ నిలిపివేయాలని, ఎన్నికల ఫలితాలు ప్రకటించవద్దని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను మాత్రం వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశాలిచ్చింది. 'మా' ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ నటుడు ఒ.కల్యాణ్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు ఈ ఉదయం విచారించి ప్రస్తుత 'మా' అధ్యక్షుడు ఎంపీ మురళీమోహన్, నటుడు అలీ ఇతర ప్రతినిధులకు నోటీసులిచ్చింది. కాగా, ఈ మధ్యాహ్నం పిటిషన్ పై వాదనలు ముగిశాయి.