: 10 శాతం తగ్గిన గ్యాస్ ధర... రిలయన్స్ కు నష్టం!


సహజ వాయు ధరను 10 శాతం తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ఒక ఎంఎంబీటీయూ (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) ధరను ప్రస్తుతమున్న 5.61 డాలర్ల నుంచి 5.02 డాలర్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. సహజ వాయు ధరను గత సంవత్సరం నవంబర్ లో ఎంఎంబీటీయూకు 4.2 డాలర్ల నుంచి 5.61 డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. కాగా, ఈ తాజా తగ్గింపు నిర్ణయం ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ తో పాటు, ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయంపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 జూన్ తరువాత అంతర్జాతీయ స్థాయిలో ధరలు పతనమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2014 ఫిబ్రవరిలో 6 డాలర్ల వద్ద ఉన్న ఎంఎంబీటీయూ గ్యాస్ ధర అక్టోబర్ నాటికి 3.78 డాలర్లకు తగ్గింది. కేంద్రం ముందు తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ధరను ప్రతి 6 నెలలకు ఒకసారి సవరించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News