: ఇంటర్నల్ మార్కులు తగ్గించిన పాపం... శాతవాహన వర్సిటీ ఆచార్యుడిపై విద్యార్థుల దాడి!
విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పడంతో పాటు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఆచార్యుడు గతి తప్పాడు. విద్యార్థులపై కక్ష పెంచుకున్న ఆయన గారు తన చేతిలోని ఇంటర్నల్ మార్కులకు కోతలేశాడు. దీంతో భగ్గుమన్న విద్యార్థులు సహనం కోల్పోయారు. తమకు పాఠాలు చెప్పిన సదరు ఆచార్యుడిపై విద్యాలయం ప్రాంగణంలోనే చేయి చేసుకున్నారు. కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో ఈ ఘటన నిన్న కలకలం రేపింది. వర్సిటీలో ఆంగ్ల విభాగాధిపతిగా పనిచేస్తున్న పీవీ లక్ష్మిప్రసాద్, ఇంటర్నల్ మార్కులు తగ్గించారని ఆరోపిస్తూ విద్యార్థులు దాడికి దిగారు. ఈ దాడిలో లక్ష్మిప్రసాద్ గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన అధ్యాపక బృందం నిరసనకు దిగింది. అదే సమయంలో విద్యార్థులు కూడా తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని వర్సిటీ గేటు ముందు నిరసనకు దిగారు. విద్యార్థులు, అధ్యాపకుల పోటాపోటీ నిరసనలతో నిన్న శాతవాహన వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.