: టీమిండియా కథ కంచికి...ఆసీస్ ఫైనల్ కి!


ప్రపంచకప్ లో టీమిండియా కథ కంచికి చేరింది. అప్రతిహత విజయాలతో సెమీఫైనల్ చేరిన భారత జట్టు, ఆస్ట్రేలియా చేతిలో ఘోరపరాజయం పాలయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో అత్యున్నత ప్రమాణాలు అందుకున్న ఆసీస్ 95 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి, ఫైనల్ లో అడుగుపెట్టింది. ఎన్నో అంచనాలు, మరెన్నో ఊహాగానాల మధ్య ఆరంభమైన సెమీఫైనల్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. బౌలర్ ఎవరన్నది చూడకుండా, ప్రణాళికాబద్ధంగా ఓవర్ కు ఏడు పరుగుల చొప్పున రన్ రేట్ తగ్గకుండా ఆస్ట్రేలియా పరుగులు సాధించింది. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ (105) సెంచరీ సాధించగా, ఫించ్ (81) రాణించాడు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లతో రాణించినా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం 329 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఏ దశలోనూ ఆసీస్ కు పోటీనివ్వలేకపోయింది. రోహిత్ శర్మ (34), శిఖర్ ధావన్ (45) మంచి ఆరంభాలిచ్చినా, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. రహానే (44) నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా కీలక సమయంలో అవుటయ్యాడు. ధోనీ (65) అప్పుడప్పుడు మెరుపులు మెరిపించినా జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేకపోయాయి. కోహ్లీ (1), రైనా (7), జడేజా (16), అశ్విన్ (5) విఫలమవగా, షమి, యాదవ్ డకౌట్ అయ్యారు. దీంతో టీమిండియా 233 పరుగులకే తోకముడిచింది. ఆసీస్ బౌలర్లలో ఫల్కనర్ (3), జాన్సన్ (2), స్టార్క్ (2) రాణించారు.

  • Loading...

More Telugu News