: త్రివర్ణమయంగా సిడ్నీ స్టేడియం... 42 వేల టికెట్లలో 30 వేలు మనోళ్లవేనట!
వరల్డ్ కప్ లో నేటి సెమీ ఫైనల్ అత్యంత కీలకమైనది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్, వరల్డ్ కప్ టైటిల్ ను అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టుగా ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో తలపడుతున్నాయి. వరుస విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ధోనీ సేన బరిలోకి దిగుతుండగా, సొంతగడ్డపై తమను ఏ ఒక్కరూ నిలువరించలేరన్న ధీమాతో ఆసీస్ ఉత్సాహంగా ఉంది. ఇదిలా ఉంటే, మ్యాచ్ జరగనున్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ పసుపుపచ్చమయంగా మారాలి. అందుకు విరుద్ధంగా సిడ్నీ స్టేడియం నేడు త్రివర్ణ పతాకాలతో నిండిపోనుంది. స్డేడియం కెపాసిటీ 42 వేలు కాగా, భారత జట్టు అభిమానులే 30 వేల టికెట్లను దక్కించుకున్నారట. దీంతో ఈ మ్యాచ్ లో టీమిండియాకు పూర్తి మద్దతు లభించనుంది. విదేశంలో ఆడుతున్నా, సొంతగడ్డపై లభించే భారీ మద్దతు ధోనీ సేనకు లభించనుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్, సిడ్నీకి పెద్ద ఎత్తున తరలిరావాలని తమ దేశ క్రికెట్ అభిమానులకు పిలుపునిచ్చాడట. అతడి మాటను కాదనలేక సిడ్నీకి చేరుకున్నా, ఆసీస్ కు మద్దతు తెలుపుతూ వారంతా స్టేడియం బయటే నిలబడక తప్పదు.