: రాజేంద్రప్రసాద్ కు చివరి వరకు తోడుంటా... మురళీమోహన్ కించపరిచారు: నాగబాబు


వాస్తవానికి రాజేంద్రప్రాద్ కు 'మా' అధ్యక్షుడు కావాలన్న కోరక లేదని... ఇతర హీరోలు, తదితరులు తమ సినిమాలతో బిజీగా ఉండటంతో, 'మా' అధ్యక్ష బాధ్యతలను స్వీకరించలేమని చెప్పారని... దీంతో, తాము రాజేంద్రప్రసాద్ ని కలిసి, బాధ్యతలు స్వీకరించాలని ఒప్పించామని ప్రముఖ నటుడు నాగబాబు చెప్పారు. దీనికి తోడు, ఈసారి ఎన్నికలో తాను పోటీ చేయలేనని, కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నానని మురళీమోహన్ తనతో చెప్పారని తెలిపారు. ఈ సందర్భంలో రాజేంద్రప్రసాద్ గురించి చెప్పానని... అయితే, ప్రసాద్ కు అంత స్టేచర్ లేదంటూ కించపరిచే విధంగా మురళీమోహన్ వ్యాఖ్యానించారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో తాను ఆశ్చర్యానికి లోనయ్యానని, రాజేంద్రప్రసాద్ కు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయనను అధ్యక్షుడిని చేస్తే 'మా'కు మంచి జరుగుతుందని చెప్పానని... అయినా ఆయన వ్యతిరేకించారని చెప్పారు. దీనికితోడు, జయసుధ పోటీ చేస్తున్నట్టు తమకు ముందు చెప్పలేదని అన్నారు. తమను బెదిరిస్తున్నారని అనవసర ఆరోపణలు చేస్తూ, చిల్లరగా వ్యవహరిస్తున్నారని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతదూరం వచ్చాక ఎన్నికల నుంచి తప్పుకునే పరిస్థితే లేదని... రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తారని... ఆయనకు తాను చివరి క్షణం వరకు తోడుంటానని హామీ ఇచ్చారు. 'మా' అంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మురళీమోహన్, నాగబాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, తదితరులే కాదని... వందల మందితో కూడిన సంస్థ అని చెప్పారు.

  • Loading...

More Telugu News