: అనుచరుడిని చంపిన గ్యాంగ్ స్టర్ చివరికి ప్రజల చేతుల్లో బలి!
తన సొంత ముఠాలోని సభ్యుడిని హత్యచేసిన గ్యాంగ్ స్టర్ ను ప్రజలు కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... హతుడు హస్మత్ తో పాటు మరో ముగ్గురు ఒక హత్యకేసులో నిందితులు. వీరిని ఆరునెలల క్రితం అదుపులోకి తీసుకోగా, హస్మత్ తప్పించుకున్నాడు. తన అరెస్ట్ కు షాబీర్ అనే అనుచరుడు కారణమని కక్ష పెంచుకొని, అతడి స్వగ్రామం ఇంద్రిష్ పూర్ కి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో షాబీర్ అక్కడిక్కడే చనిపోగా, కాల్పుల మోత విన్న గ్రామస్తులు, కోపంతో హస్మత్ ను పట్టుకొని దారుణంగా కొట్టారు. పోలీసులకు సమాచారం అంది, వారు ఘటనా స్థలికి చేరేలోపే హస్మత్ మరణించాడు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.