: రేపు మీకు కూడా జ్వరం వస్తుందేమో!
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు జరగనున్న వరల్డ్ కప్ సెమీ ఫైనల్ పోరును తిలకించేందుకు ఉద్యోగులు పెద్దయెత్తున సెలవులు పెడుతున్నారట. భారత్ లో ఈ మ్యాచ్ పై ఒక సర్వే నిర్వహించి మొత్తం 6 వేల మందిని ప్రశ్నించగా, అందులో 34 శాతం మంది తమకు ఆరోగ్యం బాగా లేదని సెలవు పెట్టనున్నట్టు తెలిపారు. మరో 2 శాతం మంది తమ ఇంట్లో దొంగతనం జరిగిందని సెలవు పెట్టనున్నట్టు చెప్పడం గమనార్హం. ఈఎస్ పీఎన్ క్రిక్ ఇన్ఫో ఈ సర్వేను నిర్వహించింది. ఈ దఫా క్రికెట్ పోటీల్లో ఇండియా ఆడిన మ్యాచ్ లు దాదాపు వారాంతాల్లో వచ్చాయి. ఫైనల్ పోరుకు ముందు జరుగుతున్న మరో ఫైనల్ పోరుగా భావిస్తున్న సెమీ ఫైనల్ మాత్రం గురువారం జరగనుంది. ఈ పోటీ ఆసాంతం దగ్గరుండి తిలకించాలని భావిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఆఫీసులకు వెళితే స్కోర్ మాత్రమే తెలుసుకుంటూ కూర్చోవాల్సి ఉంటుందని అత్యధికులు అభిప్రాయ పడుతున్నారు. కాగా, కొన్ని ఐటీ కార్యాలయాలు రేపు సెలవును ప్రకటించాయి. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు రేపు సెలవు ఇచ్చినట్టు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న 'ప్లే రైట్' బిజినెస్ విభాగం హెడ్ నయాంత్ర పాణి తెలిపారు. ఇక సిటీ బ్యాంకు గురువారాన్ని 'నో మీటింగ్ డే'గా ప్రకటించింది. తాము ఉద్యోగులకు సెలవు ఇవ్వడం లేదని, మ్యాచ్ చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కోక కోలా తెలిపింది. ఒక ముఖ్యమైన మ్యాచ్ ని చూసేందుకు ఆసక్తి చూపుతున్న ఉద్యోగులందరికీ సెలవు మంజూరు చేసినట్టు కేపీఎంజీ ఉన్నతోద్యోగి షాలినీ పిళ్ళై తెలిపారు. మరి, మీ మాటేమిటి? మ్యాచ్ ని చూసేందుకు మీరు ఎలాంటి ప్లాన్ వేస్తున్నారు? మీకు కూడా జ్వరం వస్తుందేమో! కాకపోతే, మరో అత్యవసర పని పడుతుంది... అంతే కదా?