: రోమాంచిత పోరులో నెగ్గి, ఫైనల్ చేరిన న్యూజిలాండ్!


ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు అభిమానులకు క్రికెట్ మజాను రుచిచూపించాయి. నువ్వా? నేనా? అనేట్టు కొనసాగిన తొలి సెమీఫైనల్ లో చివరి బంతి వరకు విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది. రోమాంచిత పోరులో న్యూజిలాండ్ మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించి, ఫైనల్ లో అడుగుపెట్టింది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. రెండు జట్ల విన్యాసాలను మ్యాచ్ ఆసాంతం క్రికెట్ ప్రేమికులు ఆస్వాదించారు. క్రికెట్ విశ్లేషకులు ముందుగానే పేర్కొన్నట్టు మ్యాచ్ డివిలియర్స్, మెక్ కల్లమ్ మధ్య పోరాటంలా సాగింది. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టుకు ఆదిలోనే బౌల్ట్ షాకిచ్చాడు. వరుసగా ఓపెనర్లను పెవిలియన్ బాటపట్టించి జాగ్రత్తగా ఆడాలని హెచ్చరికలు పంపాడు. డుప్లెసిస్ (82), రుసోవ్ (39) జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. రుసోవ్ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. 38 వ ఓవర్లలో వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగించడంతో అభిమానులంతా సౌతాఫ్రికాను మరోసారి విధి వెక్కిరిస్తుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతలో వర్షం ఆగడంతో డక్ వర్త్ లూయీస్ నిబంధనల ప్రకారం మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తరువాత కేవలం రెండు బంతులు ఎదుర్కొన్న డుప్లెసిస్ వెనుదిరిగాడు. అనంతరం రంగప్రవేశం చేసిన డెవిడ్ మిల్లర్ (49), డివిలియర్స్ (65)తో కలిసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో కేవలం నాలుగు ఓవర్లలోనే వీరిద్దరూ 55 పరుగులు జోడించడం విశేషం. దీంతో 43 ఓవర్లలో దక్షిణాఫ్రికా 281 పరుగులు చేసింది. అయితే డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం న్యూజిలాండ్ విజయలక్ష్యం 298గా నిర్ణయించారు. 298 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ కు కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ తిరుగులేని ఆరంభం అందించాడు. బౌలర్ ఎవర్నది పట్టించుకోకుండా, స్టెయిన్, ఫిలాండర్, మోర్కెల్ ను బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీంతో కేవలం 4.1 ఓవర్ లోనే న్యూజిలాండ్ తొలి 50 పరుగులు పూర్తి చేసింది. మెక్ కల్లమ్ ధాటికి తొలి పవర్ ప్లే ముగిసేప్పటికి న్యూజిలాండ్ 81 పరుగులు చేసి, రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో కేవలం 22 బంతుల్లోనే మెక్ కల్లమ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 71 పరుగుల వద్ద తొలి వికెట్ గా మెక్ కల్లమ్ వెనుదిరిగాడు. వెంటనే విలియమ్సన్ (6) కూడా వెనుదిరిగాడు. దీంతో గుప్తిల్ (34), రాస్ టేలర్ (30) జాగ్రత్తగా ఆడారు. టేలర్ ను డుమిని అవుట్ చేయడంతో ఇలియట్ (84) మ్యాచ్ ను చేజారకుండా జాగ్రత్తపడ్డాడు. గుప్తిల్ రనౌట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కోరె ఆండర్సన్ (58) చెత్తబంతులను బౌండరీ లైన్ దాటిస్తూ న్యూజిలాండ్ జట్టును విజయానికి చేరువగా తీసుకువచ్చాడు. ఇంతలో ఆండర్సన్, రొంచి(8) అవుట్ కావడంతో మ్యాచ్ లో ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. చివరి ఓవర్లో 6 బంతుల్లో 12 పరుగులు కావాల్సి ఉండగా వెటోరీ (7) ఓ ఫోర్, ఇలియట్ ఓ సిక్స్ కొట్టి న్యూజిలాండ్ కు చారిత్రక విజయం అందించారు. దీంతో న్యూజిలాండ్ జట్టు తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ లో అడుగుపెట్టింది. ఇలియట్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం వరించింది.

  • Loading...

More Telugu News