: అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం: అసెంబ్లీలో చంద్రబాబు


విద్యుత్ చార్జీల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేశామని అన్నారు. అధికారంలోకి వచ్చిన నెలలోనే విద్యుత్ కోతలు లేకుండా చేశామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండకూదని, విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నామని అన్నారు. కొత్త విద్యుత్ టారిఫ్ గురించి చెబుతూ... 5 శాతానికి మించి ఒక్క పైసా పెంచలేదని తెలిపారు. ప్రజలపై దొడ్డిదారిన ఒక్క పైసా భారం కూడా మోపబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 154 లక్షల మంది వినియోగదారులున్నారని, వారిలో 134 లక్షల మందిపై కొత్త టారిఫ్ భారం పడదని వివరించారు. 14 లక్షల మంది రైతులు ఒక్క పైసా కూడా కట్టనక్కర్లేదని తెలిపారు. చిన్న పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ రంగాలపై భారం ఉండదని చెప్పారు. దేశంలో ఏడెనిమిది రాష్ట్రాలతో పోల్చితే మనవద్దే విద్యుత్ చార్జీలు తక్కువని అన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీలు అధికమని తెలిపారు. తాము గతంలో పాలన చేసినప్పుడు అనుసరించిన విద్యుత్ సంస్కరణలను అనంతరం వచ్చిన కాంగ్రెస్ సర్కారు కొనసాగించలేదని విమర్శించారు. తత్ఫలితంగా 17 వేల కోట్ల రూపాయల మేర బకాయిలు మిగిలాయని పేర్కొన్నారు. బకాయిలు ఉంటే విద్యుత్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకురారని అన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజలపై 28 వేల కోట్ల విద్యుత్ భారం మోపిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News