: ఇండోనేషియాలో మరో చానల్ లాంచ్ చేసిన జీ నెట్ వర్క్
భారత్ లో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న జీ నెట్ వర్క్ ఇప్పుడు ఇండోనేషియాలో మరో టీవీ చానల్ ప్రారంభించింది. ఈ ఎంటర్ టైన్ మెంట్ చానల్ పేరు 'జీ హిబురాన్'. ఈ చానల్లో భారత్ లో ప్రజాదరణ పొందిన సీరియళ్లను డబ్ చేసి ప్రసారం చేస్తారు. అంతేగాకుండా, అనేక మనోరంజక కార్యక్రమాలను కూడా అందిస్తారు. గత 14 నెలల కాలంలో ఆసియా పసిఫిక్ రీజియన్ లో జీ నెట్ వర్క్ లాంచ్ చేసిన మూడో చానల్ ఇది. ఈ ప్రాంతంలో ఇంతకుముందు జీ బయోస్కోప్ (ఇండోనేషియా), జీ నంగ్ (థాయ్ లాండ్) అనే చానళ్లను ప్రవేశపెట్టారు. దీనిపై జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఆసియా పసిఫిక్ విభాగం బిజినెస్ హెడ్ శుశ్రుత సమంత మాట్లాడుతూ, తాజా చానల్ తో ఇండోనేషియాలో తాము దూసుకెళతామని అన్నారు. మార్కెట్ వాటా బలపడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.