: తొలి సెమీ 'ఫైనల్' రేపే... రెండు జట్లకూ అగ్నిపరీక్షే
ప్రపంచకప్ కీలక దశకు చేరుకుంది. టైటిల్ విజేతగా నిలిచేందుకు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు రెండడుగుల దూరంలో నిలిచాయి. రేపటి మ్యాచ్ రెండు జట్లకు అగ్నిపరీక్షగా నిలవనుంది. కాగా, ఈ మ్యాచ్ ను విశ్లేషకులు మెక్ కల్లమ్, డివిలియర్స్ మధ్య పోరాటంగా అభివర్ణిస్తున్నారు. మ్యాచ్ ఆరంభంలోనే చెలరేగుతూ జట్టుకు విజయాలందిస్తున్న మెక్ కల్లమ్ చెలరేగితే సెమీఫైనల్ లో సఫారీలను చిత్తుచేయడం కష్టం కాదని కివీస్ భావిస్తుండగా, డివిలియర్స్ నిలదొక్కుకుంటే కివీస్ ను ఖతం చేయడం కష్టం కాదని ప్రోటియాస్ అభిప్రాయపడుతున్నారు. రెండు జట్లలోనూ ప్రపంచస్ధాయి బౌలర్లు, అనుభవజ్ఞులైన బ్యాట్స్ మెన్ కు కొదువలేదు. ఈ నేపథ్యంలో, ఎవరు గెలుస్తారన్న విషయాన్ని నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. ఎవరైనా గెలవొచ్చని, రెండు జట్లలో ఎవరు గెలిచినా చివరకు విజేతగా నిలిచేది క్రికెట్టేనని అభిప్రాయపడుతున్నారు. దశల పరంగా చూస్తే ఇది తొలి సెమీ ఫైనల్ మ్యాచే కానీ నిజానికి తొలి ఫైనల్ గా భావించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో రేపు తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ లో స్టేడియాలు చిన్నవి కావడం రెండు జట్లలోని బ్యాట్స్ మెన్ కు కలిసివచ్చే అంశం కాగా, అభిమానుల ఆదరణ మాత్రం కివీస్ కే లభించనుంది.