: మందుకొట్టి నడిపినందుకు లక్షన్నర ఫైన్!
మనకు తెలిసినంత వరకు... మందుకొట్టి డ్రైవ్ చేస్తే డ్రంకెన్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఎంత ఫైన్ కట్టాలనేది జడ్జ్ నిర్ణయిస్తారు. ఇంకొకసారి దొరికితే జైలు శిక్ష కూడా విధిస్తారు, అంతే. కానీ, ఈ విషయం వింటే ఆశ్చర్యపోకతప్పదు. మందుకొట్టి ఓడను నడపిన ఓ నావికుడికి న్యూజిలాండ్ లోని ఓ కోర్టు రూ. లక్షన్నర వరకు జరిమానా విధించింది. నావికుడి పేరు ప్రమోద్ కుమార్ (36). భారతీయ సంతతికి చెందిన వాడు. ప్రభుత్వం అనుమతించిన దానికన్నా ఐదు రెట్లు ఎక్కువ మద్యం సేవించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అత్యంత బరువు ఉన్న నౌకను అజాగ్రత్తగా నడిపితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని... అందువల్ల ఇతరులకు సైతం బుద్ధి వచ్చేలా జరిమానా విధించాలని కోర్టును పోలీసులు కోరారు. దీంతో, ప్రమోద్ కు కోర్టు దిమ్మ తిరిగే రీతిలో ఫైన్ విధించింది.