: హీరో నాగార్జునకు బ్యాంకు నోటీసులు... ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నట్టు వెల్లడి
హీరో నాగార్జునకు టైమ్ సరిగా ఉన్నట్టు లేదు! మాదాపూర్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ కోసం పక్కనున్న చెరువును కబ్జా చేశారంటూ... అధికారులు కొంతమేర భూమిని స్వాధీనం చేసుకున్న సంగతి మరువక ముందే, అలాంటిదే మరో ఘటన జరిగింది. అన్నపూర్ణా స్టూడియోకు అనుబంధంగా వున్న 7 ఎకరాల 25 కుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్టు బ్యాంకులు ప్రకటించాయి. అక్కినేని నాగేశ్వరరావు ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న స్టూడియోలో భాగంగా ఉన్న ఈ భూమిని హామీగా ఉంచి నాగార్జున, ఆయన కుటుంబసభ్యులు బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నారు. అయితే, తిరిగి చెల్లించకపోవడంతో ఆ రుణభారం కాస్తా ఇప్పుడు రూ. 62 కోట్లకు చేరుకుంది. దీనికి సంబంధించి బ్యాంకులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా... వీరు స్పందించలేదు. దీంతో, ఇండియన్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకులు ఆస్తిని స్వాధీనం చేసుకుంటున్నట్టు పత్రికా ప్రకటన ఇచ్చి, నోటీసును పంపాయి. నాగార్జునతో పాటు, ఆయన సోదరి నాగ సుశీల, సోదరుడు అక్కినేని వెంకట్, సుప్రియ, వై.సురేంద్ర, రొడ్డం వెంకట్ లకు బ్యాంక్ నోటీసులు అందాయి. అయితే, దీనిపై నాగార్జున ఇంతవరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే, సమస్య నుంచి బయటపడటానికి నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన పలువురు... నాగార్జున కూడా ఆర్థిక సమస్యల్లో ఉన్నారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.