: మైనారిటీలను కాపాడేందుకు దేనికైనా సిద్ధమే... ఎంతదూరమైనా వెళతాం: రాజ్ నాథ్
ముంబయిలోనూ, మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లోనూ చర్చ్ లను ధ్వంసం చేయడంపై కేంద్రం స్పందించింది. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... మైనారిటీల రక్షణకు ఎంత దూరమైనా వెళతామని స్పష్టం చేశారు. అల్పసంఖ్యాక వర్గాల మధ్య నెలకొన్న అభద్రత భావాన్ని తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో ఓ కాన్వెంట్ లో నన్ ను రేప్ చేసి దోపిడీకి పాల్పడడం, ముంబయి, జబల్పూర్ ప్రాంతాల్లో చర్చ్ లపై దాడి వంటి ఘటనలతో మోదీ సర్కారుపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాజ్ నాథ్ స్పందించారు. మోదీ కూడా ఇలాంటివి సహించరాదని తన మంత్రివర్గ సహచరులకు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.