: ఢిల్లీలో ఆర్జేడీ కార్యాలయం అద్దె ఎంతో తెలుసా?... సొంత బంగ్లా ఉన్నా అద్దె భవనానికే లాలూ ఓటు!


రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పార్టీ కార్యాలయం కోసం ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో మూడంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. సదరు భవనం నిర్మాణం కూడా పూర్తైంది. ప్రస్తుతం ఖాళీగా ఉంది. అదేంటీ, పార్టీ కోసం నిర్మించుకున్న భవనాన్ని లాలూ ప్రసాద్ ఖాళీగా ఎందుకు పెట్టారు? ఎందుకంటే, సదరు భవనంలో అడుగుపెడితే, ఢిల్లీలోనే అత్యంత చవకగా లభించిన అద్దె భవనాన్ని కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి. నిజమేనండోయ్, 2001లో తన పార్టీ కార్యాలయం కోసం వీపీ హౌస్ లో విశాలమైన రెండు గదుల వరుసను ఆయన అద్దెకు తీసుకున్నారు. నాడు ఆయన దరఖాస్తును పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఆ విశాలమైన గదుల వరుసను కేవలం రూ.333ల అద్దెకు లాలూకు అప్పగించింది, అప్పటి నుంచి లాలూ తన పార్టీ కార్యాలయాన్ని అందులోనే కొనసాగిస్తున్నారు. అద్దె కూడా ఏమాత్రం పెరగలేదు. మరి ఇంత చవక బేరాన్ని వదులుకోవడానికి లాలూ ప్రసాదేమీ అమాయకుడు కాదుగా! అందుకే పార్టీకి సొంత భవనం రెడీ అయినా, అద్దె భవనంలోనే ఆర్జేడీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ పిటిషన్ కు సమాధానమిచ్చిన కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది.

  • Loading...

More Telugu News