: పాక్ దిగ్గజ బౌలర్ల సలహాతోనే ఉమేశ్ యాదవ్ రాటుదేలాడట!
టీమిండియా యువ బౌలర్ ఉమేశ్ యాదవ్ వరల్డ్ కప్ మెగా టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. మహ్మద్ షమీతో కలిసి కొత్త బంతితో వికెట్లను కూల్చడమే కాక తన పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపిస్తున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టెస్ట్, ట్రయాంగిల్ సిరీస్ లో వరుసగా విఫలమైన అతడు వరల్డ్ కప్ లో చెలరేగడానికి పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు దిగ్గజ బౌలర్లే కారణమని అతడి సోదరుడు రమేశ్ యాదవ్ చెబుతున్నాడు. పాక్ అలనాటి దిగ్గజం వసీం అక్రం, ఇటీవలే రిటైర్ అయిన ఆ దేశ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ ల సలహాలు, సూచనలతోనే ఉమేశ్ రాణిస్తున్నాడట. కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడిన సమయంలో ఆ జట్టు బౌలింగ్ కోచ్ అక్రంతో కలిసి పనిచేయడమే ఉమేశ్ కెరీర్ ను కీలక మలుపు తిప్పింది. ఆసీస్ పిచ్ లపై ఎలా బౌలింగ్ చేయాలో అక్రం, ఉమేశ్ కు పాఠాలు చెప్పాడట. అతడి సలహాలతోనే ఆసీస్ పిచ్ లపై ఉమేశ్ మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నాడు. ఇప్పటికీ బౌలింగ్ లో ఏదైనా సందేహం వస్తే ఉమేశ్ నేరుగా అక్రంకే ఫోన్ చేస్తాడని రమేశ్ చెప్పాడు. ఇక మ్యాచ్ కి ముందు మానసికంగా ఎలా సిద్ధమవ్వాలన్న అంశంపై అక్తర్ సలహాలను ఉమేశ్ పాటిస్తున్నాడట. ఇదిలా ఉంటే, ఉమేశ్ తో పాటు ఆసీస్ పిచ్ లపై రాణిస్తున్న షమీ కూడా అక్రం, అక్తర్ లు చెప్పిన బౌలింగ్ కిటుకులతోనే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.