: పంజాగుట్టలో సజీవదహనమైంది నందిగామ అమ్మాయట!
హైదరాబాద్ నడిబొడ్డున ఓ అమ్మాయి సజీవదహనం ఘటన సంచలనం సృష్టించడం తెలిసిందే. పంజాగుట్ట ఐఏఎస్ క్వార్టర్స్ సమీపంలో పాక్షికంగా కాలిపోయిన స్థితిలో కనిపించిన ఆమెను కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వాసిరెడ్డి పూజితగా గుర్తించారు. ఆమె విజయవాడలో సీఏ చదువుతోంది. పూజిత మృతి విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపారు. కాగా, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ అమ్మాయిది హత్యా? ఆత్మహత్యా? అని తేల్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూజిత ఈ నెల 18న నందిగామ నుంచి హైదరాబాద్ వచ్చింది. ఓ స్నేహితుడికి టీషర్ట్ ను బహుమతిగా ఇచ్చింది. ఆ టీషర్టులో సూసైడ్ నోట్ గా భావిస్తున్న ఓ లేఖ లభ్యమైంది. ఈ నేపథ్యంలో, పూజిత్ సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, పూజిత స్నేహితుడు అశోక్ నాంపల్లి పీఎస్ లో లొంగిపోయాడు. ఆమె మరణించడానికి కొద్దిసేపటి ముందు తనను కలిసిందని అశోక్ చెప్పినట్టు తెలిసింది. అయితే, పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.