: జ్యోతిష్యంలోనూ మాస్టర్ బ్లాస్టర్ ఘటికుడే... అతడు చెప్పిన జట్లే సెమీస్ చేరాయి!
మైదానంలో కొనసాగినంత కాలం తనదైన రీతిలో చెలరేగిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండూల్కర్, ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఏ ఒక్కరికి సాధ్యం కాని రికార్డులనెన్నింటినో లిఖించేశాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి, చట్టసభ సభ్యుడిగా కొత్త అవతారం ఎత్తిన అతడికి జ్యోతిష్యం బాగానే ఒంటబట్టినట్టుంది. తాజా వరల్డ్ కప్ లో సెమీస్ పోరుకు అర్హత సాధించే జట్లివేనంటూ మెగాటోర్నీ ప్రారంభానికి ముందే అతడు ప్రకటించాడు. తాజాగా మెగాటోర్నీ క్వార్టర్ ఫైనల్స్ అంకం ముగిసింది. సెమీస్ కు తెరలేవడమే తరువాయి. అయితే, మెగా టోర్నీకి ముందు అతడు చెప్పిన మాట మేరకే ఆతిథ్య జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో పాటు టైటిల్ ఫేవరేట్లైన టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. నాడు సచిన్ చెప్పిన మాట గుర్తుకొచ్చిన క్రికెట్ అభిమానులు, సచిన్ కు జ్యోతిష్యం కూడా బాగానే ఒంటబట్టిందని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.