: 12వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా 170 కోట్లే కేటాయిస్తారా?: ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్


స్పీకర్ పై తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆహ్వానించేంత వరకు అసెంబ్లీలో అడుగుపెట్టనన్న వైకాపా అధినేత జగన్... లోటస్ పాండ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. వడ్డీల రూపంలో రైతులు రూ. 12 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా... ప్రభుత్వం మాత్రం కేవలం రూ. 170 కోట్లు మాత్రమే కేటాయించిందని ఆరోపించారు. చంద్రబాబు మాటలు విన్న రైతులు రుణాలు కట్టకపోవడంతో, దారుణంగా నష్టపోయారని అన్నారు. వారి బంగారం కూడా వేలానికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాకముందు ఒకలా మాట్లాడిన చంద్రబాబు... సీఎం అయ్యాక మాట మార్చారని ఆరోపించారు. మన బడ్జెట్ లెక్కలను పెంచి చూపించారని, దీన్ని ఢిల్లీకి పంపిస్తే మన పరువు పోతుందని జగన్ విమర్శించారు. రూ. 80 వేల కోట్లు కూడా దాటని బడ్జెట్ ను...రూ. లక్ష 12 వేల కోట్లుగా ఎందుకు చూపించారో అర్థం కావడం లేదని చెప్పారు. ప్రణాళికేతర వ్యయంలో ఏకంగా రూ. 11 వేల కోట్లు తగ్గించి చూపించారని ఆరోపించారు. రైతుల టాపిక్ మాట్లాడకూడదని సభలో స్పీకర్ చెప్పారని... ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో కూడా స్పీకరే చెబుతారా? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రసంగాల్లో అన్నీ అబద్దపు హామీలిచ్చారని... ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఉపాధి లభించేంత వరకు ప్రతి నిరుద్యోగికీ రూ. 2 వేల భృతి ఇస్తామన్నారని... ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని అన్నారు. రైతులు రుణాలు కట్టలేనందువల్ల ఇకపై వారికి వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీలాంటి ప్రయోజనాలు ఉండవని జగన్ చెప్పారు. 30.9.2014 నాటికి వ్యవసాయ రుణాలు తడిసి మోపెడై రూ. 99,555 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. రూ. 56 వేల కోట్ల రుణాలను రైతులకు ఇవ్వాలనుకున్న బ్యాంకులు కేవలం రూ. 13,781 కోట్లు మాత్రమే ఇచ్చాయని చెప్పారు. దాదాపు రూ. 40 వేల కోట్లకు పైగా రుణాలను రైతులు బయట నుంచి అప్పుగా తెచ్చుకున్నారన్నారు.

  • Loading...

More Telugu News