: భూసేకరణ బిల్లులో ఉన్న కంపును దేశం దృష్టికి తేవడానికే అలా చేశారట
ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపేందుకు ఒక్కొక్కరూ ఒక్కో పంథా అనుసరిస్తుంటారు. స్వచ్ఛ భారత్ ద్వారా దేశం మొత్తం పరిశుభ్రత దిశగా ప్రయాణిస్తుంటే... కేంద్రప్రభుత్వం ప్రతిపాదిస్తున్న భూసేకరణ చట్ట సవరణలపై జార్ఖండ్ లో స్వచ్ఛ భారత్ కు విఘాతం కలిగేలా వినూత్న నిరసన తెలిపారు. జార్ఖండ్ లో నక్సల్స్ కు పట్టున్న లాతేహార్ జిల్లాలోని 60 గ్రామాలకు చెందిన ప్రజలు భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా, బార్వాదీ బ్లాక్ కార్యాలయం ముందు సామూహిక బహిరంగ బహిర్భూమి కార్యక్రమం నిర్వహించారు. బిల్లులో ఉన్న కంపును దేశం దృష్టికి తీసుకువచ్చేందుకే ఇలా చేశామని నిరసనకారులు తెలిపారు. కీలకమైన ఐదు రంగాల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి సామాజిక అంచనా తప్పనిసరి అనే క్లాజ్ ను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే భూసేకరణ చేపట్టే సమయంలో 80 శాతం మేరకు భూయజమానుల సమ్మతి అవసరం లేదన్న నిబంధనను కూడా కేంద్రం ఆర్డినెన్స్ లో పేర్కొంది. ఈ రెండు క్లాజుల వల్ల రైతులు, భూయజమానులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పారిశ్రామిక వర్గాలు మినహా, అన్నివర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు క్లాజులను బిల్లు నుంచి తప్పించని పక్షంలో జార్ఖండ్ రాష్ట్రమంతటా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని నిరసనకారులు తెలిపారు. వీటిపై ప్రతిపక్షాలు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.