: చెన్నైలో తీవ్రవాదులు... నౌకను హైజాక్ చేసే యత్నం... ఇదంతా పోలీసుల 'మాక్ డ్రిల్'!
ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా 61 మంది ఉగ్రవాదులు తమిళనాడు రాజధాని నగరం చెన్నైలోకి ప్రవేశించారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు దాదాపు రెండు రోజులపాటు శ్రమించి వారిని పట్టుకున్నారు. పోలీసుల కళ్లుగప్పిన ముగ్గురు చెన్నై హార్బర్ లోకి ప్రవేశించి సరుకుల లోడుతో నిండిన నౌకను హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ నౌకను చుట్టుముట్టిన పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి హార్బర్ ప్రాంతంలో కలకలం రేపింది. ఇదంతా 'ఆపరేషన్ ఆమ్లా' పేరిట చెన్నై పోలీసులు చేసిన మాక్ డ్రిల్ లో ఒక భాగం. ఈ మాక్ డ్రిల్ బుధవారం ఆరంభమై గురువారం వరకు సాగింది. దీనిలో భాగంగా తీవ్రవాదుల వేషంలో వచ్చిన 61 మందిని అదుపులోకి తీసుకోవడం అన్నది పోలీసుల పని. ఈ 61 మంది కూడా పోలీసులే. వీరిలో కొందరు ముప్పుతిప్పలు పెట్టిన మీదటే దొరికారట. చివరికి అసలు విషయం తెలుసుకున్న ప్రజలు హమ్మయ్య అనుకున్నారు.