: మెల్ బోర్న్ స్టేడియంలో బాహుబలి పోస్టర్... భీమవరం ఫ్యాన్స్ వినూత్న సంబరం!
విడుదలకు ముందే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సంచలన చిత్రం ‘బాహుబలి’ అంతర్జాతీయంగా సంచలనం రేపింది. టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, సుదీర్ఘ కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిన్న ఆస్ట్రేలియా నగరం మెల్ బోర్న్ లోని మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో టీమిండియా, బంగ్లాదేశ్ ను చిత్తు చేసి వరల్డ్ కప్ సెమీస్ లోకి అడుగుపెట్టింది. అయినా బాహుబలి చిత్రానికి, టీమిండియా మ్యాచ్ కు సంబంధం ఏముందనుకుంటున్నారా?. సంబంధమేమీ లేదు కానీ, మన భీమవరం క్రికెట్ అభిమానులు టీమిండియా జైత్రయాత్రకు ప్రభాస్ బాహుబలి జోష్ ను కలిపేశారు. టీమిండియా విజయానందంలో బాహుబలి ఉత్సాహాన్ని కలిపేసుకుని ఎంజాయ్ చేశారు. అసలు విషయమేంటంటే, నిన్నటి టీమిండియా మ్యాచ్ జరిగిన ఎంసీజీలోని వీక్షకుల స్టాండ్స్ లో బాహుబలి పోస్టర్ దర్శనమిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన కొందరు యువకులు నిన్నటి మ్యాచ్ ను వీక్షించారు. ఈ సందర్భంగా వారు ప్రభాస్ బాహుబలి పోస్టర్ తో సందడి చేశారు. ఈ పోస్టర్ అక్కడి క్రికెట్ అభిమానులనూ విశేషంగా ఆకట్టుకుంది.