: కర్నూలు-బెంగళూరు హైవేపై పేలుతున్న గ్యాస్ సిలిండర్లు... తగలబడిపోతున్న లారీ!
కర్నూలు- బెంగళూరు జాతీయ రహదారిపై కొద్దిసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. నిండా గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న ఓ లారీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. లారీలోని సిలిండర్లు వరుసగా పేలిపోతున్నాయి. ప్రమాదాన్ని గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్లు లారీ నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదం నేపథ్యంలో హైవేపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. లారీకి ఇరువైపులా 4 కిలో మీటర్ల దూరంలోనే వాహనాలను పోలీసులు నిలిపేశారు. లారీ నుంచి ఎగసిపడుతున్న మంటలతో అక్కడి సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం నేపథ్యంలో ఏనుగుమర్రి గ్రామస్థులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లారీలో మొత్తం 400 సిలిండర్లుండగా, ఇప్పటిదాకా 50 సిలిండర్లు పేలిపోయాయి. ఒక్కొక్కటిగా సిలిండర్లు పేలుతుండటంతో మంటలను ఆర్పేందుకు లారీ దగ్గరికి వెళ్లేందుకే అవకాశం లేకుండా పోయింది.