: విశాఖలో నకిలీ ఐఏఎస్... 400 మందిని మాయ చేసి కోట్లు దండుకున్న వైనం!


చదివింది డిగ్రీనే. అయితేనేం తానో ఐఏఎస్ అధికారిని అంటూ అతడు జనాన్ని ఈజీగానే నమ్మించేశాడు. కేంద్ర పరిశ్రమల శాఖలో రీజనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తాను ఆంధ్రా, ఒడిశా, తమిళనాడులోని ఆ శాఖ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నానని నమ్మబలికాడు. ఎర్రబుగ్గ కారు, దానిపై ప్రభుత్వ వాహనమన్న నేమ్ ప్లేట్ అతడికి మరింత ఊతాన్నిచ్చాయి. దీనికి తోడు నేర్చుకున్న నాలుగు ఇంగ్లీష్ ముక్కలతో మాయ చేశాడు. తన చేతి కింద ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించాడు. 400 మంది దగ్గర కోట్లాది రూపాయలను వసూలు చేశాడు. తీరా ఉద్యోగాలు లేవు. తీసుకున్న డబ్బు కూడా అతడు తిరిగి ఇవ్వడం లేదు. పైపెచ్చు డబ్బడిగితే, అంతు చూస్తానంటూ బాధితులపైనే విరుచుకుపడతాడట. వివరాల్లోకెళితే... శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురానికి చెందిన రమేశ్ నాయుడు డిగ్రీ దాకా చదువుకున్నాడు. ఉన్నత విద్య కోసమంటూ ఊరి నుంచి బయటకు వచ్చిన అతడు, విశాఖకు చెందిన ఓ గ్రూప్-1 అధికారి కూతురును వివాహం చేసుకున్నాడు. అంతే, ఒక్కసారిగా అతడిలోని మాయగాడు బయటకొచ్చేశాడు. తానో ఐఏఎస్ అధికారినంటూ జనాన్ని మాయ చేశాడు. ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి, విశాఖలోని చిన వాల్తేరుకు చెందిన 400 మందిని మోసం చేశాడు. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బు తిరిగివ్వమన్న బాధితులపై అతడు అంతు చూస్తానంటూ ఒంటికాలిపై లేస్తాడట. ఈ నేపథ్యంలో అతడి నుంచి డబ్బు వసూలు చేసుకోలేక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక సతమతమవుతున్న కొందరు నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ ను కలిసేందుకు సమాయత్తమవుతున్నారు.

  • Loading...

More Telugu News