: భర్త బాకీ తీర్చలేదని భార్యను నిర్బంధించిన వడ్డీ వ్యాపారులు... మెదక్ జిల్లాలో దారుణం
కుటుంబ అవసరాల కోసం తీసుకున్న అప్పును భర్త తీర్చలేదట. అందుకని ఆ ఇంటి ఇల్లాలిని వడ్డీ వ్యాపారులు నిర్బంధించారు. చిన్నారి పాప సహా ఆమెను గంటల తరబడి తమ అధీనంలో ఉంచుకున్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... నర్సాపూర్ కు చెందిన మల్లేశం, సునీత దంపతులు పొట్టకూటి కోసం హైదరాబాదుకు వలస వెళ్లారు. ఏడాదిన్నర క్రితం అత్యవసరమై నర్సాపూర్ లోని వడ్డీ వ్యాపారుల వద్ద మల్లేశం రూ. 20 వేలు అప్పు తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటిదాకా ఆ అప్పును మల్లేశం తీర్చలేకపోయాడు. ఈ క్రమంలో నిన్న నర్సాపూర్ వచ్చిన సునీతను వడ్డీ వ్యాపారులు నిర్బంధించారు. తమ ఇంటికి ఆమెను తీసుకెళ్లి, రోడ్డుపై కోర్చోబెట్టారు. నీ భర్త బాకీ తీర్చే దాకా నిన్ను వదిలిపెట్టేది లేదంటూ ఆ కసాయి వ్యాపారులు తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీ లేక చిన్నారి కూతురితో కలిసి ఆమె బిక్కుబిక్కుమంటూ రోడ్డుపైనే కూర్చుండిపోయింది. విషయం తెలిసి అక్కడికెళ్లిన మీడియాను ‘‘అప్పు మీరు తీరుస్తారా?’’ అంటూ సదరు వ్యాపారి ప్రశ్నించాడు. ఎట్టకేలకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సునీతను బందీఖానా నుంచి విడిపించారు. ఆమెను నిర్బంధించిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.