: స్నాప్ డీల్ వాణిజ్య ప్రకటనల్లో ఆమిర్ ఖాన్... రెమ్యూనరేషన్ రూ.20 కోట్లట!
బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ యాడ్స్ లో కనిపించనున్నాడు. ఈ మేరకు స్నాప్ డీల్, ఆమిర్ ల మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కోకా కోలా, శ్యాంసంగ్, గోద్రెజ్, టాటా స్కై, టైటాన్ వాచీల యాడ్స్ లో కనిపించిన ఆమిర్, వాటి విక్రయాలను భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఆయా ప్రకటనల్లో భిన్నత్వానికి పెద్ద పీట వేసిన ఆమిర్, తనదైన శైలిలో సత్తా చాటాడు. ఈ-కామర్స్ రంగంలో దేశీయ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తో పాటు అమెజాన్ తో గట్టి పోటి ఎదుర్కొంటున్న స్నాప్ డీల్, తన మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఆమిర్ ను సంప్రదించిందట. స్నాప్ డీల్ ఆఫర్ కు ఆమిర్ సానుకూలంగా స్పందించాడట. ఈ మేరకు కుదిరిన ఒప్పందం మేరకు ఆమిర్ కు స్నాప్ డీల్ రూ. 20 కోట్ల మేర రెమ్యూనరేషన్ ను ఇవ్వనుందని సమాచారం.