: నీతి, నిజాయతీ గల ఐఏఎస్ అధికారిని హత్య చేశారు: సదానందగౌడ
నీతి, నిజాయతీ గల ఐఏఎస్ అధికారిని హత్య చేశారని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ ఆరోపించారు. కర్ణాటకలో ఐఏఎస్ అధికారి డి.కె.రవి మృతిపై ఆయన మాట్లాడుతూ, ఎలాంటి విచారణ లేకుండానే ఆత్మహత్య కేసుగా నమోదు చేశారని అన్నారు. కేంద్ర హోం మంత్రిని కలిసి కర్ణాటకలో పరిస్థితిని వివరిస్తామని ఆయన తెలిపారు. కాగా, డి.కె.రవి పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను వైద్యులు విడుదల చేశారు. ఊపిరి ఆడని కారణంగా ఆయన మృతి చెందారని నివేదికలో తెలిపారు. రవి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, శరీరంలో విషం ఆనవాళ్లు కూడా లభ్యం కాలేదని స్పష్టం చేశారు. కాగా, ఆయన మృతిపై కర్ణాటకలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక, రియల్ మాఫియానే ఆయనను అంతమొందించిందని ఆరోపిస్తున్నారు.