: ఈ మృగాడిని రెండు సార్లు ఉరి తీయండి... కోయంబత్తూరు మహిళా కోర్టు సంచలన తీర్పు


కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ మృగాడు తనకు లొంగలేదనే కారణంగా ఓ మహిళను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ దారుణాన్ని భయంతో బిక్కచచ్చిపోయి చూస్తూ నిలబడిపోయిన సదరు మహిళ ఆరేళ్ల కుమారుడితో పాటు, అసలేం జరుగుతోందో కూడా తెలియని 11 నెలల పసికందును కూడా హత్య చేశాడు. ఈ దారుణ మారణకాండకు ఒడిగట్టిన కరడుగట్టిన కసాయికి కోయంబత్తూరులోని మహిళా న్యాయస్థానం అరుదైన శిక్ష వేసింది. నిన్న కిక్కిరిసిన కోర్టు హాలులో ‘ఈ తీర్పుతో భవిష్యత్తులో ఈ తరహా నేరాలకు పాల్పడాలంటేనే బెంబేలెత్తాలి’’అంటూ న్యాయమూర్తి తన తీర్పు వెలువరించారు. ఇద్దరు చిన్నారులను హతమార్చిన సదరు దుర్మార్గుడిని రెండు సార్లు ఉరి తీయాలని చెప్పిన న్యాయమూర్తి, మహిళపై హత్యాచారానికి యావజ్జీవ శిక్ష, పిల్లల బంగారాన్ని దోచుకున్నందుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తున్నట్లు ప్రకటించారు. కోయంబత్తూరులోని గణపతి రామకృష్ణపురం రంగనాథన్ వీధికి చెందిన గృహిణి వత్సలాదేవి (26), కుమారులు మగిళన్ (6), ప్రణీత్ (11 నెలలు), భర్తతో కలిసి ఉంటున్నారు. తన ఇంటిలోని ఓ పోర్షన్ ను శివగంగై జిల్లా మానామధురైకి చెందిన సెంథిల్ (32)కు అద్దెకిచ్చారు. గొడవల నేపథ్యంలో భార్య పుట్టింటికెళ్లిపోగా, వత్సలాదేవిపై సెంథిల్ కన్నేశాడు. అతడి దుర్బుద్ధిని గ్రహించిన వత్సలాదేవి అతడిని తన ఇంటి నుంచి ఖాళీ చేయించింది. అయినా, తన బుద్ధి మారని సెంథిల్ గతేడాది జూన్ 1న వత్సలాదేవి ఇంటికి వచ్చి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించిన ఆమెను కత్తితో ఇష్టమొచ్చినట్లు పొడిచేశాడు. దీనిని చూస్తూ బిక్కచచ్చిపోయిన ఆమె కుమారులిద్దరినీ అతడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం పిల్లల మెడల్లోని బంగారాన్ని తీసుకుని పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెంథిల్ ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచడమే కాక నేరంలో అతడి ప్రమేయాన్ని నిరూపించారు. దీంతో న్యాయమూర్తి అతడిని రెండు సార్లు ఉరి తీయాలని తీర్పు చెప్పారు.

  • Loading...

More Telugu News