: సెన్సార్ విషయంలో కేంద్రమంత్రిని కలిసిన బాలీవుడ్ పెద్దలు
సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు అనుసరిస్తున్న విధానాన్ని మెరుగుపర్చాలంటూ బాలీవుడ్ పెద్దలు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ను కలిశారు. రమేశ్ సిప్పీ, మహేశ్ భట్, గుల్జార్ తదితరులు మంత్రిని కలిసి చర్చించారు. కేంద్ర సెన్సార్ బోర్డుకు చైర్మన్ గా వచ్చిన పహ్లాజ్ నిహలాని హిందీ, ఇంగ్లీషు భాషల్లోని పలు పదాలను సినిమాల్లో వాడరాదంటూ స్పష్టం చేశారు. అంతేగాకుండా, అనుష్క శర్మ 'ఎన్.హెచ్.10 చిత్రానికి భారీగా కత్తెర వేశారు. ఈ విషయాలన్నీ బాలీవుడ్ ప్రముఖలు కేంద్ర మంత్రికి వివరించారు. దీనిపై రాథోడ్ మాట్లాడుతూ... తమ భేటీ ఏ ఒక్క వ్యక్తి గురించో కాదని, సినిమా నిర్మాణం సాఫీగా సాగేందుకు తగిన పరిస్థితులు కల్పించడంపైనేనని తెలిపారు. ఇతర మంత్రులతో కూడా చర్చించి సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.