: తొమ్మిదేళ్ల, తొమ్మిది నెలల తరువాత సోనియాకు ఏపీ గుర్తురావడం హర్షణీయం: వెంకయ్య
తొమ్మిదేళ్ల, తొమ్మిది నెలల, తొమ్మిది రోజుల, తొమ్మిది గంటల తరువాత సోనియా గాంధీకి ఆంధ్రప్రదేశ్ గుర్తు రావడం హర్షణీయమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పార్లమెంటులో సోనియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, అత్యధిక రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనకు అంగీకరించాయని అన్నారు. 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాటిచ్చారు, మరి రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు 2014 వరకు ఎందుకు ఆగాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. విభజిస్తామని మాటిచ్చిన తరువాత వందల మంది ఆత్మత్యాగాలు చేసుకునేంత వరకు రాష్ట్రాన్ని ఎందుకు విభజించలేదని ఆయన నిలదీశారు. విభజన చట్టంలో చాలా లోపాలు ఉన్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు ఎక్కడ, ఏది, ఎలా ఉండాలో, చేయాలో స్పష్టంగా చెప్పలేదని ఆయన మండిపడ్డారు. నిన్న సభలో వీరప్పమొయిలీ మాట్లాడుతూ, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక రాష్ట్రాన్ని విభజించినప్పుడు తారతమ్యాలు వచ్చేలా ఎందుకు విభజించారని ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక లోటులో ఉందని ఆయన స్పష్టం చేశారు. విభజన బిల్లులో పేర్కొన్న విధంగా, ఆంధ్రప్రదేశ్ లో ఐఐఎం కు ఫౌండేషన్ వేశామని తెలిపారు. బిల్లులో పేర్కొన్న ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయని, ఆ రెండూ మిత్రపక్షాలన్న విషయం మరవొద్దని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఉన్న ఇబ్బందులను అధిగమిస్తున్నామని ఆయన చెప్పారు. బిల్లులో స్పెషల్ స్టేటస్ ఉండి ఉంటే అమలు చేసి ఉండేవారమని అన్నారు. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ మాట ఇచ్చినందువల్ల దానిని ఎలా అమలు చేయాలా? అని ఆలోచిస్తున్నామని, బిల్లులో లేని కారణంగా స్పెషల్ స్టేటస్ గురించి చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన రాయితీలపై చర్చలు సాగిస్తున్నామని, అన్నీ ఆలోచిస్తామని ఆయన అన్నారు. సమస్యలను ఒకటి తరువాత ఒకటిగా పరిష్కరిస్తున్నామని ఆయన చెప్పారు. తాను తెలంగాణకు రాకూడదని అక్కడి నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, తాను కేంద్ర మంత్రిగా దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. అలాగే నేతలంతా గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే, తాను కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని సూచించారు. ఒక రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక బాధ్యతగా స్పందించాను తప్ప, తనకు పక్షపాతం లేదన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు.