: అమెరికాలో భారత దంత వైద్య విద్యార్థిని హత్య
ఆస్ట్రేలియాలో భారత మహిళపై దాడి చేసి దారుణంగా హతమార్చిన ఉదంతాన్ని మరువక ముందే అమెరికాలో మరో ఘటన జరిగింది. కాలిఫోర్నియా పరిధిలోని ఆల్బనీ ప్రాంతంలో ఒక భారత దంత వైద్య విద్యార్థిని రణధీర్ కౌర్ (37) తలపై షూట్ చేసి హత్య చేశారు. ఓ సిక్కు దేవాలయంలో మధ్యాహ్న ప్రార్థనలకు వెళ్లి అపార్ట్ మెంట్ కు వచ్చిన ఆమెపై దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఎవరో ఆమె ఇంట్లోకి బలవంతంగా చొరబడి ఘటనకు పాల్పడినట్లు అనిపించడం లేదని వివరించారు. ఈ ఘటన ఈ నెల 8వ తేదీన జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఇంతవరకూ ఎవరిపైనా నిందితులన్న అనుమానాలు కలగలేదని అధికారులు తెలిపారు. తలలోకి ఒకే బులెట్ ను సమీపం నుంచి కాల్చడంతో ఆమె మృతి చెందినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగేందుకు ప్రజలు తమకు తెలిసిన సమాచారాన్ని అందించాలని పోలీసులు కోరుతున్నారు.