: సాహితీవేత్త రాళ్లబండి కవితా ప్రసాద్ కన్నుమూత... నేడు హైదరాబాదులో అంత్యక్రియలు


ప్రముఖ సాహితీవేత్త రాళ్లబండి కవితా ప్రసాద్ కన్నుమూశారు. హృద్రోగ సమస్యతో హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో సాంస్కృతిక శాఖలో పలు కీలక పదవులు అలంకరించిన రాళ్లబండి, అవధానంలో పేరు ప్రఖ్యాతులు గాంచారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శిగానే కాక తెలంగాణ దళిత అభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగానూ పనిచేశారు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామానికి చెందిన ఆయన హైదరాబాదులోనే స్థిరపడ్డారు. 500లకు పైగా అవధానం కార్యక్రమాలను నిర్వహించి, అవధాన విద్యలో సరికొత్త పోకడలకు శ్రీకారం చుట్టిన ఆయనను ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఆయన భౌతిక కాయానికి పలువురు సాహితీవేత్తలు నివాళులర్పించారు. నేడు రాళ్లబండి అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబం ప్రకటించింది.

  • Loading...

More Telugu News