: హైదరాబాదులో అందమైన 'మహాప్రస్థానం'!


పుట్టిన వాడు మరణించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి హితోపదేశం చేసినట్టు, పుట్టిన ప్రతి ఒక్కరూ నేలతల్లి ఒడిలో శాశ్వతంగా నిద్దురపోవాల్సిందే. ఈ నేపథ్యంలో నానాటికీ పట్టణాల్లో శ్మశానాల కరవు పెరిగిపోతోంది. కబ్జారాయుళ్లు శ్మశానాలను కూడా వదలడం లేదు. హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో శ్మశానాల్లోనే సమాధుల మధ్య ఇళ్లు ఏర్పాటు చేసుకుంటున్న కథనాలు కూడా ప్రసారమైన సంగతి తెలిసిందే. శ్మశానాల సమస్యను నివారించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. పైలట్ ప్రాజెక్టుగా ఓ అత్యాధునిక శ్మశానాన్ని ఫిల్మ్ నగర్ లో నిర్మించారు. దీనికి 'మహాప్రస్థానం' అని పేరు పెట్టారు. ఇందులోకి అడుగిడగానే ఓ అందమైన పార్కులో అడుగుపెట్టిన అనుభూతి కలిగేలా దీనిని నిర్మించారు. మరణించిన వారికి వీడ్కోలు పలుకుతున్నట్టు గోడను వంగి నమస్కరించేలా నిర్మించారు. అలాగే అంత్యక్రియల కోసం వచ్చే బంధువులు చివరి సంస్కారాలు ఆచరించేందుకు 3 వేల డిగ్రీల ఉష్ణోగ్రతతో క్రిమేషన్ సౌకర్యం కల్పించారు. అనంతరం స్నానాలు ఆచరించేందుకు, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. క్రిమేషన్ అనంతరం అస్థికలను ప్రత్యేక పద్ధతిలో సేకరించి బంధువులకు అందజేయనున్నారు. సామాజిక సంప్రదాయాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించామని అధికారులు వెల్లడించారు. త్వరలోనే మరో ముప్పై మహాప్రస్థానాలు నిర్మించనున్నామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News