: వెంకన్న దర్శనానికి 5 గంటలు... తలనీలాలకు 10 గంటలు... తిరుమలలో క్షురకుల కొరత!


కలియుగ దైవం వెంకన్న దర్శనానికి ముందే భక్తులకు కల్యాణకట్ట వద్ద దేవుడు కనపడుతున్నాడు. శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంటే, తలనీలాల మొక్కు తీర్చుకునేందుకు 10 గంటల వరకూ సమయం పడుతోంది. దీంతో భక్తులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నా, తమను అధికారులు పట్టించుకోలేదంటూ భక్తులు నినాదాలు చేశారు. కాగా, గుండు కొట్టిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ క్షురకులు డబ్బు తీసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినందునే, ఉద్దేశపూర్వకంగా భక్తులను ఇబ్బంది పెట్టేలా వారు వ్యవహరిస్తున్నారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. నిజానికి తిరుమలలో రద్దీ భారీగా పెరిగి స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుందన్న సమయంలో కూడా తలనీలాలు సమర్పించడానికి భక్తులు ఏడు గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే నిన్న, ఇవాళ రద్దీ ఒక మోస్తరుగా ఉన్నా, ఏడు నుంచి 10 గంటల సమయం పడుతోంది. నిన్న తలనీలాల భక్తుల క్యూ సుమారు 3 కిలోమీటర్ల మేరకు పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టి.టి.డి నాయి బ్రాహ్మాణ సంఘం నేతలు మాత్రం, సిబ్బంది కొరత వల్లే భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని, ఇందుకు పూర్తి బాధ్యత టి.టి.డి యాజమాన్యందేనని అంటున్నారు.

  • Loading...

More Telugu News