: సల్మాన్ అక్కడ దొరికాడట!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను హిట్ అండ్ రన్ కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. 2002 సెప్టెంబరులో సల్మాన్ యాక్సిడెంట్ కు పాల్పడిన అనంతరం అతడి ఆచూకీ లభ్యం కాలేదట పోలీసులకు. ఈ కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి అయిన కిషన్ షెంగాల్ శుక్రవారం కోర్టుకు పలు విషయాలు తెలిపారు. "ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సల్మాన్ ఖాన్ నివాసానికి వెళ్లాను. అయితే, అతనక్కడ కనిపించలేదు. ఇంటి వెనుక ఉన్న జిమ్ కు కూడా వెళ్లాను. అక్కడ ఆరేడు గ్యారేజీలు ఉన్నాయి. అక్కడా లేడు. ఇదే విషయాన్ని మా సీనియర్ అధికారులకు తెలియజేశాను. సెప్టెంబర్ 28 ఉదయం 9 గంటల ప్రాంతంలో ఓ సమాచారం అందింది. సల్మాన్ బాంద్రాలోని అల్మీదా పార్క్ లో ఉన్న తన లాయర్ ను కలిసేందుకు వెళతాడన్నదే దాని సారాంశం. అయితే, మాకు ఆ లాయర్ చిరునామా దొరకలేదు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించి అడ్రెస్ పట్టుకున్నాం. ఆ న్యాయవాది ఇంటికి వెళ్లి చూస్తే... అక్కడున్నాడు సల్మాన్! అక్కడి నుంచి అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి, ఆ తర్వాత అరెస్టు చేశాం" అని వివరించారు. అరెస్టు విషయాన్ని సల్మాన్ బంధువొకరికి తెలియజేశామని, అటుపై సల్మాన్ ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లామని షెంగాల్ తెలిపారు.