: సెబీకి ఎదురు దెబ్బ!... డీఎల్ఎఫ్ పై నిషేధం చెల్లదన్న ట్రైబ్యునల్


రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ పై సెక్యూరిటీస్ ఎక్స్చేంజి బోర్డు అఫ్ ఇండియా (సెబీ) విధించిన నిషేధం చెల్లదని సెక్యూరిటీస్ అపిలేట్ ట్రైబ్యునల్ (ఎస్ఏటీ) తీర్పిచ్చింది. గతంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ను ప్రకటించిన సమయంలో సమాచారాన్ని వెల్లడించలేదన్న ఆరోపణలపై డీఎల్ఎఫ్ ను, సంస్థ చైర్మన్ కేపీ సింగ్ సహా ఆరుగురు ఉన్నతోద్యోగులను మూడేళ్ల పాటు మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధిస్తూ సెబీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది అసమంజసమని వాదిస్తూ, డీఎల్ఎఫ్ సంస్థ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. కేసును విచారించిన ట్రైబ్యునల్ ఇటువంటి నిషేధం తగదని అభిప్రాయపడింది. కాగా, ఈ విషయమై డీఎల్ఎఫ్ స్పందిస్తూ, భారత న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, తీర్పు పూర్తి పాఠాన్ని చూసిన తరువాత అభిప్రాయాలు తెలుపుతామని పేర్కొంది. కాగా, 2007లో ఐపీఓకు వచ్చిన డీఎల్ఎఫ్ రూ.9,187 కోట్ల రూపాయలను సమీకరించింది. ఆ సమయంలో కంపెనీ పూర్తి వివరాలు ప్రకటిస్తూ విడుదల చేసిన డీఆర్ హెచ్ పీ (డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్) లో సమగ్ర సమాచారాన్ని ఇవ్వలేదన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన సెబీ గత సంవత్సరం అక్టోబర్ లో సంస్థపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News