: అందరూ చూస్తుండగానే... కుమార్తెను కసిదీరా కొట్టిన పోలీసాఫీసర్
బెంగళూరులో ఓ పోలీస్ అధికారి కన్న కూతురన్న విచక్షణ కూడా లేకుండా చేయిచేసుకున్నాడు. వివరాల్లోకెళితే... రాజారాం అనే వ్యక్తి మదురైలో పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఓ టీచర్. వారి కుమార్తె బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. అయితే, గిట్టనివాళ్లు ఆ యువతిపై చెడుగా ప్రచారం చేయడంతో ఆ ఎస్సై ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే బెంగళూరు వెళ్లి, కుమార్తె ఎంత మొత్తుకుంటున్నా వినకుండా ఆమెను నడిరోడ్డుపైకి ఈడ్చి చితకబాదాడు. తానేమీ తప్పుచేయలేదని చెబుతున్నా పట్టించుకోకుండా, కాలితో ఇష్టం వచ్చినట్టు తన్నాడు. కుమార్తెకు అదో గుణపాఠం అంటూ భార్య కూడా భర్తకు మద్దతుగా నిలిచింది. స్థానికులు, ఇతరులు చోద్యం చూశారే తప్ప చాలాసేపటివరకు ఆమెను రక్షించేవారే లేకపోయారు. చివరికి ఇద్దరు మహిళలు ఆమెను కాపాడి తమతో తీసుకెళ్లారు. అరగంట తర్వాత స్థానిక ఉల్సూరు పోలీసులు వచ్చి ఆ యువతిని, ఆమె తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇది చిన్న విషయమని, కుటుంబ విషయమని అందుకే ఫిర్యాదు నమోదు చేయలేదని స్టేషన్ ఆఫీసర్ తెలిపారు.