: ధోనీని అభిమానిస్తున్నానని 'ద్రోహి' అని పిలుస్తున్నారు: పాక్ వీరాభిమాని 'న్యూ చాచా'


పాకిస్థాన్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా... సంప్రదాయ దుస్తుల్లో, తెల్లనిగడ్డంతో కనిపించే ఓ వ్యక్తి జాతీయ జెండా చేతబూని అభిమానులను ఉత్సాహపరుస్తూ కనిపిస్తాడు. అతని పేరు అబ్దుల్ జలీల్ చౌదరి. అందరూ 'చాచా' అని పిలుచుకుంటారు. ఆయన ఆర్థిక ఇబ్బందులతో వరల్డ్ కప్ కు రాలేకపోయాడు. ఇప్పుడు మరో 'చాచా' తయారయ్యాడు. అతడి పేరు బషీర్. పాకిస్థాన్ లో పుట్టి షికాగోలో సెటిలైన ఈ కొత్త చాచా వరల్డ్ కప్ లో సందడి చేస్తున్నాడు. అయితే, భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య అడిలైడ్ లో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇతడిని పాక్ అభిమానులు 'ద్రోహి' అంటూ దూషించారట. టీమిండియా కెప్టెన్ ధోనీని అభిమానిస్తున్నట్టు బహిరంగంగా చెప్పడమే అందుక్కారణం. పాక్ అభిమానుల వైఖరి తనకెంతో బాధ కలిగించిందని బషీర్ చెప్పుకొచ్చాడు. ధోనీని ఆరాధిస్తానని, అతడెంతో మంచి మనిషని పేర్కొన్నాడు. కుల, మత, వర్గాలకు అతీతంగా ధోనీ ఎంతో మంచివాడని కొనియాడాడు. తానెవరినో తెలియకున్నా, ఓ జర్నలిస్టు ఇచ్చిన సమాచారంతో ధోనీ తనకు మ్యాచ్ టికెట్ పంపాడని బషీర్ సంబరపడిపోయాడు. ఆ గుణమే ధోనీలో తనకు నచ్చిందని తెలిపాడు. అన్నట్టు... ఈ కొత్త చాచా భారత్ అల్లుడే. భార్యది హైదరాబాదే. ధోనీకి ఇటీవలే అమ్మాయి పుట్టిందని, తమ మతంలో తొలుత అమ్మాయి పుడితే ఐశ్వర్యం వస్తుందని నమ్ముతామని తెలిపాడు. ఇదే విషయాన్ని తాను ధోనీకి కూడా చెబితే, నవ్వుతూ థాంక్స్ చెప్పాడని మురిసిపోయాడు. ధోనీ ఉండడంతో టీమిండియా వరల్డ్ కప్ విజయానికి అర్హురాలేనని అన్నాడు. తాజా వరల్డ్ కప్ లో 'న్యూ చాచా' టీమిండియా మ్యాచ్ లకు కూడా హాజరై సందడి చేయడం విశేషం.

  • Loading...

More Telugu News