: విజయంతో గ్రూప్ దశ ముగించిన సఫారీలు
దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ కప్ గ్రూప్ దశను విజయంతో ముగించింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో యూఏఈ జట్టును 146 పరుగుల తేడాతో చిత్తుచేసింది. టాస్ ఓడిన సఫారీలు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 341 పరుగులు చేశారు. కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (99) శతకం చేజార్చుకున్నాడు. లోయరార్డర్ లో బెహార్డియన్ (64 నాటౌట్) రాణించాడు. మిల్లర్ 49, రూసో 43 పరుగులు చేశారు. నవీద్ 3 వికెట్లు తీశాడు. అనంతరం, భారీ లక్ష్యంతో బరిలో దిగిన యూఏఈ జట్టు 47.3 ఓవర్లలో 195 పరుగులు మాత్రమే చేసింది. భారత సంతతి బ్యాట్స్ మన్ స్వప్నిల్ పాటిల్ 57* పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. షాయిమాన్ అన్వర్ 39 పరుగులు చేశాడు. ఫిలాండర్, మోర్కెల్, డివిలియర్స్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు. కాగా, గ్రూప్-బిలో మొత్తం 6 మ్యాచ్ లాడిన దక్షిణాఫ్రికా 4 విజయాలు, 2 ఓటములతో రెండోస్థానంలో నిలిచింది. గ్రూప్ టాపర్ గా టీమిండియా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.