: ఇసుక మాఫియా వీరంగం... రెవెన్యూ సిబ్బందికి తీవ్ర గాయాలు
తెలంగాణలో ఇసుక మాఫియా ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తమకు అడ్డువస్తున్న సామాన్య ప్రజలతో పాటు అధికారులపైనా దాడులకు దిగుతూ ప్రభుత్వానికే సవాల్ విసురుతోంది. తాజాగా నిన్న రాత్రి నల్లగొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై దాడికి దిగింది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం గుర్నాథ్ పల్లిలో ఇసుకను తరలించుకుపోతున్న ఓ ట్రాక్టర్ ను రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్ఏలు అడ్డుకున్నారు. సదరు ట్రాక్టర్ అక్రమంగా తిరుగుతున్నదని నిర్ధారించి స్వాధీనం చేసుకున్నారు. అయితే ట్రాక్టర్ వెంట ఉన్న ఇసుక మాఫియా వారిపై దాడికి తెగబడింది. ఈ దాడిలో తీవ్ర గాయాలైన ఇద్దరు వీఆర్ఏలను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.