: మనోభావాలను 'పీకే' బాధించి ఉంటే క్షమాపణ చెబుతున్నా: అమీర్ ఖాన్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ క్షమాపణ చెబుతున్నాడు. తన తాజా చిత్రం 'పీకే' వల్ల ఎవరైనా మనస్తాపం చెంది ఉంటే క్షమించాలని కోరారు. ఎవరి మత భావాలను దెబ్బతీయాలన్న ఎలాంటి ఉద్దేశం ఈ సినిమా దర్శక, నిర్మాతలకు లేదని అన్నారు. "ఈ చిత్రం మెజారిటీ సంఖ్యలో ప్రేక్షకుల చేత ప్రేమించబడింది. అయితే ఒక్క వ్యక్తినైనా బాధించి ఉంటే వ్యక్తిగతంగా నేను బాధపడుతున్నా. ఏ స్థాయిలోనూ అది నా ఉద్దేశం మాత్రం కాదు. సినిమాలో మేము ఏదైతే చెప్పాలనుకుని చెప్పామో చాలా ముఖ్యమైన అంశం. ఒకవేళ ప్రేక్షకులను నేను బాధపెట్టి ఉంటే క్షమాపణ చెబుతున్నా" అని అమీర్ వివరణ ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 19న విడుదలైన 'పీకే'కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా అదే సమయంలో కొంతమంది నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద రూ.500 కోట్లకుపైగా బిజెనెస్ చేసి కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా ఇంతటి బిజినెస్ చేస్తుందని తాము ఊహించలేదని అమీర్ అంటున్నారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సంజయ్ దత్ లు నటించారు. అమీర్ గ్రహాంతరవాసిగా కనిపించారు.