: ‘కొత్తపల్లి’కి రుణాలిచ్చిన బ్యాంకు మేనేజర్ యాక్సిడెంట్ లో మృతి... ఘటనపై అనుమానాలు!
మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడికి రుణాలిచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ చీఫ్ మేనేజర్ సత్యనారాయణమూర్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కృష్ణా జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఈ ఘటనపై మీడియాలో నేడు పలు ఆసక్తికర కథనాలు ప్రచురితమయ్యాయి. వివరాల్లోకెళితే.., పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్బీఐ ఆర్వోబీ శాఖ నుంచి చేపల చెరువుల పేరిట కొత్తపల్లి సుబ్బారాయుడు రూ.6 కోట్ల మేర రుణం తీసుకున్నారు. సరైన పత్రాలు లేకుండానే కొత్తపల్లికి రుణం మంజూరు చేసిన అప్పటి ఆర్వోబీ చీఫ్ మేనేజర్ గోపాలకృష్ణమూర్తి సస్పెండయ్యారు. ఆయన స్థానంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణమూర్తి బ్యాంకు జారీ చేసిన రుణాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కొత్తపల్లిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే, నిన్న విజయవాడలో జరిగిన ఎస్బీఐ జోనల్ సమావేశానికి హాజరవుతున్న క్రమంలో సత్యనారాయణమూర్తి ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన ఓ ఖాళీ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో సత్యనారాయణమూర్తి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంపై అనుమానాలను వ్యక్తం చేస్తూ తెలుగు పత్రికలు పలు కథనాలను రాశాయి.