: నమ్మక ద్రోహం చేశారు... మన్మోహన్ నిందితుడే... ఆరోపణలు రుజువైతే ఏడేళ్ల వరకూ జైలు శిక్ష!
తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు మోస్తున్న వేళ హిందాల్కోకు నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు గనులను కేటాయించిన మన్మోహన్ సింగ్ ఈ కుంభకోణంలో నిందితుడని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 8న సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాలని సమన్లు పంపింది. ఆయనపై అవినీతి నిరోధక చట్టంలోని నమ్మక ద్రోహం, నేరపూరిత కుట్ర విభాగాల కింద ఆయనపై కేసు నమోదైంది. తాలిబరా-2 బొగ్గు క్షేత్రాన్ని నిబంధనలు మీరి హిందాల్కో సంస్థకు మన్మోహన్ కట్టబెట్టారని పేర్కొంది. 2005 సంవత్సరంలో మే 7, 17 తేదీల్లో కుమారమంగళం బిర్లా ఈ గనులను హిందాల్కోకు కేటాయించాలని రెండు లేఖలు ప్రధాని కార్యాలయానికి రాశారని, ఆ తరువాత ప్రధాని హోదాలో ఆయన వాటిని కట్టబెట్టారని తెలిపింది. ఈ ఉదంతంపై నైవేలి లిగ్నైట్ మాజీ చైర్మన్ ఎస్ జయరామన్ ను సాక్షిగా పేర్కొంటూ, ఆయన స్టేట్ మెంటును సీల్డ్ కవర్లో ప్రత్యేక కోర్టుకు సీబీఐ సమర్పించింది. కాగా, ఈ కేసులో ఆరోపణలు రుజువైతే మన్మోహన్ సింగ్ కు 7 సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది.